స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం‘జులాయి'. అల్లు అర్జున్ సినిమా అంటే మాంచి మాస్ మసాలా బీట్లు ఉన్న ఓ ఐటం సాంగు తప్పని సరి. ఆయన సినిమాల్లో ఇది వరకు వచ్చిన ‘ఆ అంటే అమలాపురం', ‘రింగ రింగ' లాంటి ఐటం సాంగులు తెగ పాపులర్ అయ్యాయి. తాజాగా జులాయి చిత్రంలోనూ అలాంటి పాట ఒకటి ఉంటుంది అభిమానులు భావించడం సహజం.
అయితే ఈ చిత్రంలో ఆలాంటి మసాలా సాంగు లేదట. ఈ విషయాన్ని నిర్మాత, ఈచిత్రం సమర్పకులు డివివి దానయ్య స్వయంగా స్పష్టం చేశారు. మా సినిమా మొత్తం ఎంటర్ టైన్మెంట్‌తో సాగుతుంది. అందుకే ఐటం సాంగు అవసరం రాలేదు అని చెప్పుకొచ్చారు. జూన్ 10న ఈచిత్రం ఆడియో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గబ్బర్ సింగ్ తో ఊపు మీదున్న దేవి ఈ ఆడియోని అదరకొట్టాడని చెప్తున్నారు. అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి ‘జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు.
''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ 'జులాయి' కథ తిరుగుతుంది. .జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందనేది సినిమా కథాంశం''
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియాన నటిస్తోంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్ శైలి సంభాషణలు, అర్జున్ నృత్యాలు అలరిస్తాయి. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: రాధాకృష్ణ, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పకులు: డి వివి దానయ్య.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment