.
Home » » రానా - జెనీలియాలతో తోలేటి 'నా ఇష్టం' అంటే.. ఏం చేస్తాం..?!!

రానా - జెనీలియాలతో తోలేటి 'నా ఇష్టం' అంటే.. ఏం చేస్తాం..?!!

Written By Hot nd spicy on Friday, 23 March 2012 | 07:58

చిత్రం - నా ఇష్టం
విడుదల - శుక్రవారం(ఉగాది)
నటీనటులు: దగ్గుబాటి రానా, జెనీలియా, హర్షవర్థన్, బ్రహ్మానందం, అలీ, నాజర్ తదితరులు ; సంగీతం: చక్రి, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రకాష్ తోలేటి

సీరియస్ పాత్రల నుంచి లవర్ బోయ్ దిశగా దగ్గుబాటి రానా అడుగులేస్తూ నటించిన చిత్రం "నా ఇష్టం." ఉగాది రోజున విడుదలైన ఈ చిత్రం గురించి కాస్త బ్రీఫింగ్.. ఖండాంతరాలకు ఆవల అబ్బాయి.. అమ్మాయిల ప్రేమలపై చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి ట్రాక్‌లోనిదే ఈ చిత్రమూను. ప్రేమించిన అమ్మాయి తను మలేషియాకు వచ్చేస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇక్కడ నుంచి బయల్దేరి మలేషియాకు వెళుతుంది. అతగాడేమో ఉద్యోగం కోసమంటూ అమెరికా వెళ్లిపోతాడు. మరి పెళ్లి చేస్కునేందుకు మలేషియాలోని గుడి దగ్గరికి వచ్చేసిన అమ్మాయికి అబ్బాయి కనిపించడు.

ముహూర్త సమయానికి వచ్చేస్తాడని ఎదురుచూస్తూ అలాగే కాచుక్కూచుంటుంది. ఒక రోజు గడిచినా అక్కడే వెయిటింగ్... అలా పాత కాలపు ప్రేయసిలా బిక్క ముఖం వేసుకుని చూస్తూనే ఉంటుంది. ఇది చాలు ఇక మిగిలిన సినిమా ఎలా ఉంటుందో చెప్పేందుకు.. ఇక కథలోకి వెళ్దాం...

గణేష్ (రానా) మలేషియాలో మ్యారేజ్ కాంట్రాక్టు కంపెనీలో పనిచేస్తుంటాడు. ఇతడికి డబ్బు సంపాదన తప్ప మరో యావ ఉండదు. ఇతగాడికి అనుకోకుండా ఓ గుడిలో తన ప్రియుడు కిశోర్ (హర్షవర్ధన్) కోసం వేచి చూస్తూ కూచుకున్న కృష్ణవేణి (జెనీలియా) కనిపిస్తుంది. ఎంతకీ ప్రియుడు రాకపోవడంతో చావాలని ప్రయత్నిస్తుంది. ఆమెను కాపాడి ఇంటికి తీసుకు వెళతాడు గణేష్. అలా ఇంటికి తీసుకెళ్లిన అతడికి.. ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తెలుసుకుంటాడు. దాంతో ఆమెను తిరిగి మలేషియా తీసుకొచ్చేస్తాడు.

ఆ క్రమంలో ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కానీ అంతలో కృష్ణవేణి ప్రియుడు కిషోర్ గణేష్‌ను కలుస్తాడు. అతడు కృష్ణవేణి ప్రియుడని తెలిసినా అతడిని కృష్ణవేణితో కలవనివ్వకుండా చేస్తూ ఆమె తనను ప్రేమించేలా చేసుకుంటాడు. కానీ ఓ సందర్భంలో కిషోర్, కృష్ణవేణిలకు అసలు నిజం తెలుస్తుంది. అప్పుడు కృష్ణవేణి, కిషోర్‌లు ఏ చేశారన్నది మిగిలిన సినిమా.

ప్రస్తుతం ప్రేక్షకులు లాజిక్‌గా ఆలోచించడం ఎక్కువే. ఏదో కాలక్షేపం బఠాణీ అని వచ్చేవాళ్లు కొందరే. వీళ్లు కూడా ఏమాత్రం తేడా వచ్చినా "సుత్తి" అనేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా తీయాలంటే అంత సామాన్యమైనది కాదు. డైరెక్టర్ ప్రకాష్ తెరకెక్కించిన కథలో ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. తన మనసులో ఏదో ఓ క్యారెక్టర్‌ను సృష్టించుకుని దాని చుట్టూ ఇతర పాత్రలను అల్లుకుంటూ రెండున్నర గంటలపాటు సాగిపోయినట్లు అనిపిస్తుంది తప్ప ప్రేక్షకుడు సినిమాలో లీనమైపోయినట్లు అనిపించదు.

హీరోను పచ్చి స్వార్థపరుడని చూపించి.. ఆ తర్వాత హీరోయిన్ ఒకే ఒక్క చూపుతో ప్రేమలో పడినట్లు తీశారు. హీరోయిన్‌ను ప్రేమించడానికి వెనుక బలమైన కారణమే అగుపించదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మొత్తమ్మీద హీరో రానాకు ఇది ఎంతమాత్రం మైలేజిని ఇస్తుందో సందేహమే. ఉగాది నాడు విడుదలైన "నా ఇష్టం" చిత్రాన్ని ప్రకాష్ తోలేటి నిజంగానే "నా ఇష్టం" అన్నట్లు తీశారేమో అనిపిస్తుంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger