కన్నడ భామ ప్రణీతకు అక్కడకంటే తెలుగు, తమిళంలో అవకాశాలు వచ్చాయి. పోకూరి బాబూరావు సినిమా 'ఏం పిల్ల ఏం పిల్లడో'లో నటించింది. ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. అంతకుముందు సిద్దార్థ్‌తో 'బావ'లో నటించింది. అదీ పెద్దగా లాభించలేదు. కానీ తెలుగు, తమిళభాషల్లో రూపొందిన 'శకుని' చిత్రంలో కార్తీతో పాటు నటించే అవకాశం కల్గింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే హైదరాబాద్ వచ్చింది. శకుని తర్వాత పాత్రల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్న ప్రణీత చెప్పిన కబుర్లు..
'శకుని'కి ముందు మళ్ళీ తెలుగులో కన్పించలేదు?
తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ సక్సెస్‌లు లేకపోవడంతో ఎవరూ పిలువలేదు. పోకూరి బాబూరావుగారు తన సినిమా చేస్తున్నప్పుడే చెప్పారు. ఈ సినిమా సక్సెస్ అయితే నీకు ఆఫర్లు వస్తాయని.. అదే నిజమైంది. అందుకే ఈసారి ప్రాధాన్యత గల పాత్రలే చూసుకోవాలనుకున్నాను. అనుకోకుండా శకునిలో నటించే అవకాశం కల్గింది.
శకునిలో మీ పాత్ర పాటలకే పరిమితంగా కన్పించిందే?
కథ ప్రకారం అలా ఉంటుందని దర్శకుడు ముందుగానే చెప్పాడు. రెండు భాషల్లోనూ రిలీజ్ కావడంతో మంచి గుర్తింపు వస్తుందని భావించాను. అలానే జరిగింది.
ఎక్స్‌పోజింగ్ చేయాల్సివస్తే?
ఇంతవరకు అలాంటి పాత్రలు రాలేదు. వచ్చినా నన్ను అలా చూస్తారనుకోవడంలేదు.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉందని భావిస్తున్నారా?
ఇండస్ట్రీలో ఏదో భాషలో ప్రతిరోజూ కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నారు. కొత్త హీరోలు వస్తున్నారు. వారి సరసన సీనియర్స్ ఎలాగూ నటించరు. అందుకే హీరోయిన్ల కోసం కొత్తవారిని ట్రై చేస్తున్నారు. ఆ రకంగా కొత్త హీరోయిన్లు వస్తున్నారు. చిత్రసీమలో ఆశలు పెట్టుకుని చాలామంది వస్తున్నారు. ఇక్కడ ప్రతిభతోపాటు కొంచెం లక్కు కూడా ఉంటేనే నిలబడగలుగుతున్నారు.
ఇప్పుడున్న హీరోల్లో ఎవరితో మీ కెమిస్ట్రీ బాగా కుదిరింనుకుంటున్నారు?
సిద్దార్థ్‌తోనే. బావ సినిమాలో మేమిద్దరమూ చక్కటి పెయిర్ అని చాలామంది అన్నారు. బావామరదళ్లుగా చక్కగా సరిపోయామని కూడా నాకు అనిపించింది.
తెలుగు డబ్బింగ్ మీరే చెప్పుకుంటారా?
మాతృభాష కన్నడ. తెలుగుకు, కన్నడకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. అందుకే తెలుగు ఈజీగా అర్థమయి మాట్లాడుతున్నాను. ఇదంతా ఇండస్ట్రీలో సినిమాలు చేయడంవల్లే నేర్చుకున్నాను. డబ్బింగ్ చెప్పేస్థాయికి ఇంకా చేరుకోలేదు. త్వరలో నేనే చెబుతాను.
శకుని చిత్రాన్ని చూశారా?
చెన్నైలో చూశాను. థియేటర్లలో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో నా పాత్ర పేరు శ్రీదేవి. ఆ పేరు వినగానే నా ఫేవరేట్ శ్రీదేవి గుర్తుకు వచ్చేది. బావామరదళ్ళుగా కార్తీ నేను నటించాం. తెలుగులో ఇంకా చిత్రాన్ని చూడలేదు. ఈ రోజే చూస్తాను.
పెండ్లిపై మీ అభిప్రాయం?
పెళ్లనేది ఒకేసారి జరిగేది. అది పెద్దవాళ్ళే గైడ్ చేయాలి. ప్రేమించుకున్నా ఇరువైపుల వారికి చెప్పి చేసుకోవాలి. నేనింకా ఎవరినీ ప్రేమించలేదు. ప్రేమిస్తే ఇంట్లో వారితోనే ముందుగా చెప్పేస్తా.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment