.
Home » » బాలయ్య అధినాయకుడా..?! "అతి"నాయకుడా..?!!

బాలయ్య అధినాయకుడా..?! "అతి"నాయకుడా..?!!

Written By Hot nd spicy on Friday, 1 June 2012 | 10:46

నటీనటులు: బాలకృష్ణ, లక్ష్మీరాయ్, సలోని, జయసుధ, కోటశ్రీనివాసరావు, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సుకన్య, మురళీశర్మ తదితరులు.
సంగీతం : కళ్యాణీ మాలిక్,
నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి
దర్శకత్వం: పరుచూరి మురళి.

బాలకృష్ణ సినిమా అనగానే ఫ్యాక్షనిజం, బాంబు బ్లాస్ట్‌లు, తొడగొట్టడాలు గుర్తుకొస్తాయి. తాజాగా బాలయ్య బాబు నటించిన "అధినాయకుడు" సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు పరుచూరి మురళి వెండితెరపై ఆవిష్కరించిన విధానం అభిమానుల్ని ఆకట్టుకునేలా చేసింది. ఇందులో బాలకృష్ణ త్రిపాత్రాభినయం పోషించడం విశేషం. బాలకృష్ణను మూడు పాత్రల్లో పరుచూరి మురళి తీర్చిదిద్ధిన విధానం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథలోకి వెళితే..
హరిశ్చంద్రప్రసాద్ (బాలకృష్ణ) ప్రజల కోసం పోరాడే మనిషి. ప్రజల తలలో నాలుకగా మసలుతూ సిసలైన నాయకుడిగా ఎదుగుతాడు. రాయలసీమలోని 11 నియోజకవర్గాల ప్రజలకు ఈయనే పెద్ద దిక్కు. ప్రజలను బాగుపరచాలనే ఉద్దేశంతో తానున్న ఊరిలో ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయిస్తారు. ఈ నిర్ణయాన్ని హరిశ్చంద్రప్రసాద్ వ్యతిరేకులు అడ్డుకుంటారు.

ఈ క్రమంలో హరిశ్చంద్ర ప్రసాద్ కుమారుడు రామకృష్ణ ప్రసాద్ (బాలయ్య) తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు కంకణం కట్టుకుంటాడు. ఈయన కొడుకు బాబి (బాలకృష్ణ). బాబిని హరిశ్చంద్ర ప్రసాద్ వ్యతిరేకులు(కోట, చరణ్ రాజ్)లు అస్త్రంగా ఉపయోగించుకుంటారు. చిన్నప్పుడే బాబిని ఎత్తుకెళ్లిపోవడంతో చరణ్ రాజ్ విలన్ల వద్దనే పెరుగుతాడు. వారి మాటలను తూచా తప్పకుండా పాటించే బాబి తాతయ్య అయిన హరిశ్చంద్ర ప్రసాద్‌నే చంపేస్తాడు.

ఇలా తండ్రి మరణానంతరం ప్రభుత్వ భూముల్ని వాడుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్న హరిశ్చంద్ర ప్రసాద్ వ్యతిరేకుల ఆటకట్టించి, ప్రజలకు మేలు చేయాలని రామకృష్ణ ప్రసాద్ భావిస్తాడు. ఈ క్రమంలో రామకృష్ణ మంచిపేరు సంపాదిస్తాడు. కానీ తన కొడుకు బాబినే తండ్రి (హరిశ్చంద్ర ప్రసాద్) చంపేశాడని తెలిసి.. బాబిని ఇంట్లో చేరనివ్వడు.

కానీ బాబి పెద్దవాడయ్యాక తాను ఎవరిని చంపానోన్న విషయాన్ని తెలుసుకుని పశ్చాత్తాప పడతాడు. తదనంతరం తన తండ్రిని కలుస్తాడు. ఈ క్రమంలో బాబి, రామకృష్ణ ప్రసాద్‌లు కలిసి విలన్లను ఎలా ఎదుర్కొన్నారు.. హరిశ్చంద్ర ప్రసాద్ ఆశయాన్ని ఎలా నెరవేర్చారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
నందమూరి హీరో బాలకృష్ణ అధినాయకుడులో మూడు పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకుల్ని మెప్పించాడు. హరిశ్చంద్ర ప్రసాద్ పాత్ర నిడివి తక్కువైనా తండ్రి ఎన్టీఆర్ పాత్ర తలపించింది. హరిశ్చంద్ర ప్రసాద్ ఆహార్యం, సంభాషణలు అభిమానులను క్లాప్ కొట్టేలా చేసింది. మొత్తానికి రాయలసీమలో ఫ్యాక్షనిజంను రూపుమాపి ప్రజలు ఆనందంగా ఉండాలనే సందేశాన్ని దర్శకుడు హరిశ్చంద్ర ప్రసాద్ పాత్ర ద్వారా చెప్పించాడు.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అధినాయకుడు సినిమా ఉందని వార్తలొచ్చిన నేపథ్యంలో.. ఈ సినిమాకు నేటి సామాజిక పరిస్థితులకు పొంతనలేదనే చెప్పాలి. ఇక రామకృష్ణ ప్రసాద్ పాత్ర సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా చేసింది. హీరోయిన్ల సంగతికొస్తే.. మర్యాద రామన్నలో హీరోయిన్‌గా ఆకట్టుకున్న సలోని అధినాయకుడులో ఐటమ్ సాంగ్‌కే పరిమితమైంది.

ఇక లక్ష్మీరాయ్ గ్లామర్‌గా కనిపించినా.. సన్నివేశాల్లో పండించలేకపోయింది. లక్ష్మీరాయ్‌కి బదులు వేరొక హీరోయిన్‌ను ఎంపిక చేసివుంటే బాగుండేది. హరిశ్చంద్ర భార్య జయసుధ పాత్ర కూడా నిడివి తక్కువే. కానీ జయసుధ పాత్రకు న్యాయం చేసింది. ప్రతీ పాత్ర కథకు తగ్గట్టు పరుచూరి చిత్రీకరించారు.

ఈ సినిమాకు మైనస్ పాటలే. అధినాయకుడు పాటలు ఆకట్టుకునేలా లేవు. సందర్భానుసారంగా పాటలు లేకపోవడం ఈ చిత్రానికి మైనస్సే. ప్రథమార్థంలో బ్రహ్మానందం కామెడీ హైలైట్‌గా నిలిచింది. మిగిలిన పాత్రలు సాదాసీదా ఉన్నాయి. మొత్తానికి పరుచూరి మురళి అనుకున్న విధంగా అధినాయకుడిని తెరకెక్కించగలిగాడు.

సినిమా మొత్తం రాజకీయ కోణంలో సాగినా కుటుంబ విలువలు మరువకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. రాయలసీ నేపథ్యంలో కథ సాగడం వలన కథ కొంతమందకి వై.ఎస్. రాజారెడ్డి, వై.ఎస్. రాజశేఖర రెడ్డి, వై.ఎస్. జగన్‌లను తలపిస్తున్నట్లు భావించవచ్చు. ఇంకా వీరిపై సెటైర్‌గా పాత్రలు మలచడం విశేషం. చాలాకాలం తర్వాత త్రిపాత్రాభినయంతో వచ్చిన "అధినాయకుడు" ఓ మోస్తరు సినిమాకు అటుఇటు సినిమాగా చెప్పుకోవచ్చు.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger