Pages

Friday, 27 January 2012

'స్నేహితుడు'... ఆల్‌ ఈజ్‌ వెల్‌

నటీనటులు: విజయ్‌, జీవా, శ్రీరామ్‌, ఇలియానా, సత్యరాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మూలకథ: రాజ్‌కుమార్‌ హిరాణి, సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస,
సంగీతం: హేరిస్‌ జయరాజ్‌,
ఎడిటింగ్‌: ఆంటోని,
ఆర్ట్‌: ముత్తురాజ్‌,
డాన్స్‌: ఫరా ఖాన్‌, శోభిరాజ్‌,
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి,
రామజోగయ్యశాస్త్రి, వనమాలి,
సౌండ్‌ ఎడిటింగ్‌: రసూల్‌ పూకుట్టి,
నిర్మాణం: జెమిని ఫిల్మ్‌ సర్క్యూట్‌,
దర్శకత్వం: శంకర్‌.
విడుదల: 26.1.2012 గురువారం.

ఈ సినిమాగురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో 2009లో విడుదలైన '3 ఇడియట్స్‌'కు రీమేక్‌. అసలది 'ఫైవ్‌ పాయింట్‌ సమ్‌వన్‌' అనే నవలనుంచి తీసుకున్నపాయింట్‌. అమీర్‌ఖాన్‌, కరీనాకపూర్‌, ఆర్‌.మాధవన్‌ పోషించిన ఈ పాత్రలను తమిళంలో విజయ్‌, శ్రీరామ్‌, జీవా, ఇలియానా పోషించారు.

దాన్ని తెలుగులో డబ్‌ చేశారు. శంకర్‌ దర్శకత్వం వహించడంతో ఈ చిత్రానికి క్రేజ్‌ ఏర్పడింది. హిందీలో ఈ చిత్రం అప్పట్లోనే 10రోజుల్లో ఊహించని వసూళ్ళు రాబట్టింది. మరి తమిళం, తెలుగులో అంతలా బావుంటుందా? అనేది ప్రశ్నార్థకం.

వెంకట్‌ (శ్రీరామ్‌), నిఖిల్‌ (జీవా), కోదండపాణి (విజయ్‌)... ముగ్గురు ఇంజనీరింగ్‌ కాలేజీ స్టూడెంట్స్‌. దేశంలో ఫేమస్‌ అయిన ఇంపీరియల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ హాస్టల్‌లో ఒకే రూమ్‌లో ఉంటారు. వెంకట్‌ తను ఫొటోగ్రఫీలో ప్రొఫెసల్‌ అవ్వాలనుకున్నా తన తండ్రి ఇష్టప్రకారమే ఇంజనీరింగ్‌ చదువుతాడు.

నిఖిల్‌.. మాత్రం ఇంజనీరింగ్‌ చేసి ఒక ఫ్యామిలీకి జీవనాధారంకావాలని కోరిక. విజయ్‌మాత్రం తను పెద్ద ఇంజనీర్‌అవ్వాలనే ఇక్కడ జేరతాడు. పుస్తకాల్లో కంఠతాచేసేది చదువుకాదు. ప్రాక్టికల్‌గా నేర్చుకున్నదే జీవితానికి ఉపయోగపడుతుందని కోదండపాణి పాలసీ. జీవితంలో మనం ఏంకావాలనుకుంటున్నామో అదే చేయాలనీ, ఎవరి ఒత్తిడిమేరకు బతకకూడదని ఫిలాసఫీకూడా చెప్పి రూమ్‌మేట్స్‌ మనసు మార్చేస్తాడు.

కాలేజీ డీన్‌ సత్యరాజ్‌ తన రూల్స్‌తో విద్యార్థుల్ని హింసిస్తుంటాడు. అందరూ అతన్ని వైరస్‌అని ముద్దుగా పిలుస్తుంటారు. ముగ్గురు స్టూడెంట్స్‌తోపాటు మరో స్టూటెండ్‌ రామ్‌ ఉంటాడు. తన చదువు పూర్తయ్యాక విదేశాల్లోకి బాగా సంపాదించాలని ఎయిమ్‌తో ఉంటాడు. రామ్‌కు తెలుగు సరిగ్గారాదు... అతను కాలేజీ వార్షికోత్సవం స్పీచ్‌ను పాణి మార్చేస్తాడు. దీంతో అవమానంగా భావించిన రామ్‌ ప్రాణిగ్రాహితో ఛాలెంజ్‌ చేస్తాడు. పదేళ్ళలో నేను ఎంతోరేంజ్‌కు వెళతాను.

నువ్వు నాలా ఎదగలేవని సవాల్‌ విసరుతాడు... అనుకున్నట్లు పదేళ్ళు గడుస్తాయి. తను అనుకున్నట్లు రామ్‌ పెద్ద రిచ్‌గా విదేశాలనుంచి వస్తాడు. వచ్చి మిగిలిన ఫ్రెండ్స్‌ను కలుస్తాడు. అందరూ తలో ఫీల్డులో స్థిరపడతారు. పాణి అక్కడ ఉండదు. ఎక్కడో ఉన్నాడని తెలుసుకుని అతనికోసం వెతుక్కుంటూ వెళతారు. అదొక రాజవంశానికి చెందిన భవనం... పాణి ఇంత రిచ్చా అనుకుంటారు

కానీ అక్కడ పాణి స్థానంలో ఎస్‌.జె.సూర్యను చూసి షాకవుతారు. పాణి తన తోటమాలి కొడుకని... తన స్థానంలో అతను చదివాడని సూర్య చెబుతాడు. అతను ఎక్కడున్నాడో చెప్పడంతో... ముగ్గురు ఫ్రెండ్స్‌ కలిసి పాణి కోసం బయలుదేరతారు. మధ్యలో పాణి ప్రేమించిన రుయ (ఇలియానా)కు పెండ్లి అవుతుంటే.. ఆపేసి.. పాణి దగ్గరకు తీసుకెళతాడు.. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది సినిమా.

ఇందులో నలుగురు స్నేహితులు ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. తెలివిగల విద్యార్థిగా విజయ్‌ బాగా సూటయ్యాడు. తెలుగులో ఈ పాత్రను మహేష్ బాబును అనుకున్నారని మొదట్లో ప్రచారం జరిగింది. సినిమా చూశాక... అది కరెక్ట్‌గా సరిపోతాడనిపించింది. విజయ్‌ తెలుగువారికి కొత్తయినా... పాత్రను చాలా ఈజీగా చేసేశాడు. డాన్స్‌పరంగా బాగాచేశాడు. జీవా, శ్రీరామ్‌పాత్రలు పండాయి. ఇలియానా గ్లామర్‌ తగ్గినా పాత్ర పర్వాలేదు.

ప్రొఫెసర్‌గా సత్యరాజ్‌ పాత్ర హైలైట్‌. హావభావాలు, డైలాగ్స్‌లు కొత్తదనాన్ని చూపాడు. పాటల్లో శంకర్‌ముద్ర కన్పించింది. ప్రతి సినిమాలో సెంటిమెంట్‌గా ఉండే.. ఓ పాట ఇందులోనూ ఉంటుంది. రాజుగెటప్‌, గుర్రాలు ఇందులో ఉంటాయి. హరీస్‌ జైరాజ్‌ సంగీతం పర్వాలేదు. సంభాషణలు పొందికగా లాజిక్కుగా వున్నాయి. సెంటిమెంట్స్‌ బాగా పండాయి.

రిటైర్‌ పోస్ట్‌మాన్‌ జీవితం, పెళ్ళికాని చెల్లిలి కోసం.. కొడుకు ఇంజనీర్‌ను చేయాలనే జీవా తల్లి తాపత్రయం సెంటిమెంట్‌తోపాటు హాస్యాన్ని జోడించిన దర్శకుడు ప్రతిభకు నిదర్శనం. పదిమందికోసం తన కుమారుడ్ని ఇంజనీర్‌ను చేయాలనే మధ్య తరగతి తండ్రి మనస్తత్వం కళ్లకు కట్టినట్లు చూపాడు. ఇవికాక... స్నేహితుల మద్య జరిగేసన్నివేశాలు, పరీక్షలకు అటెండయి.. పేపర్లయి మిక్స్‌ చేసే సన్నివేశాలు హాస్యాన్ని పండించాయి.

ఇలా ఒక పక్క సెంటిమెంట్‌, హాస్యంతో ఆకట్టుకునేట్లుగా దర్శకుడు మలిచాడు. క్లైమాక్స్‌లో వర్షంతో ట్రాఫిక్‌ జామ్‌ అయి, కరెంట్‌లేని స్థితిలో ఇలియానా సోదరి డెలివివరీని విజయ్‌ చేసేవిధానం కొత్తగా ఉంది. అప్పట్లోనే ఈ సన్నివేశం విమర్శలకు గురయింది. ఏదిఏమైనా కొత్త తరహా చిత్రాన్ని చూశామనే ఫీలింగ్‌ హిందీ వర్షన్‌ చూడనివారికి కలుగుతుంది. ఏదైనా పాజిటివ్‌గా ఆలోచిస్తే పనవుతుందనే లాజిక్కుతో... 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అంటూ గుండెమీద చేయివేసుకుని ప్రారంభించమని విజయ్‌ చెప్పడం బాగుంది.

No comments:

Post a Comment