.
Home » » గాలిలో తేలిపోయిన "తూనీగ... తూనీగ....

గాలిలో తేలిపోయిన "తూనీగ... తూనీగ....

Written By Hot nd spicy on Friday, 20 July 2012 | 09:57

నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, రియా, గీత, పరుచూరిబ్రదర్స్‌, నాగబాబు, ప్రభు, విజయ్‌చందర్‌, షిండే, ఎం.ఎస్‌. నారాయణ, చంద్రమోహన్‌ తదితరులు ; సమర్పణ: దిల్‌ రాజు, నిర్మాత: మాగంటి రామ్‌చందన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.ఎస్‌.రాజు.

పాయింట్‌: పావురం కలిపే తూనీగ ప్రేమ! 

ప్రభు, నాగబాబు స్నేహితులు. కోటీశ్వరుడైన ఆర్‌ఆర్‌ గ్రూప్‌కంపెనీ అధినేత నాగబాబుకు పేదవాడైన ప్రభు స్నేహితుడు. వంటలో ఆరితేరినవాడు కావడంతో తనవద్దే చెఫ్‌గా పెట్టుకుంటాడు. తన స్థాయికి తగ్గ కుటుంబంలోని బంధువులకంటే మిన్నగా ప్రభుకు వాల్యూ ఇస్తాడు. ప్రభు కొడుకు సుమంత్‌ అశ్విన్‌, నాగబాబు కుమార్తె రియా చిన్నతనంలోనే పిల్లచేష్టలతో ఆటపట్టించుకుంటారు. అది తారాస్థాయికి చేరడంతో నాగబాబు కూతుర్ని విదేశాల్లో చదివిస్తారు. 

12 ఏళ్ళ తర్వాత పెరిగి పెద్దవారవుతారు. నాగబాబు తన ఫ్యామిలీ సభ్యులకు పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆయన తండ్రి విజయ్‌చందర్‌. జీవితంలో వెయ్యవ పౌర్ణమి చూడాలనేది కల. ఆ రోజు వస్తుంది. ఆ సమయానికి కలిసిన కుటుంబసభ్యులతో పాటు సుమంత్‌ అశ్విన్‌ కూడా వస్తాడు. విదేశాల నుంచి రియా వస్తుంది. పశుపక్షాదులంటే ప్రేమ ఆమెకు. అలా ఒకరికొకరు తెలీయకుండా ఇద్దరూ ప్రేమలో పడతారు. 

ఇది సహించని నాగబాబు బావమరిది వినోద్‌కుమార్‌ ఫ్యామిలీ రియాపై అశ్విన్‌ అంటే ఏవగించుకునేలా ప్లాన్‌ చేస్తారు. దీనిద్వారా రియాను తన కోడిలిగా చేసుకోవాలనేది వినోద్‌కుమార్‌ ప్లాన్‌. వారనుకున్నట్లు తమ కోడలు అయ్యే సమయానికి ఓ ట్విస్ట్‌తో కథ మారిపోతుంది. అది ఏమిటి? అన్నది సినిమా.

కోటీశ్వరుల కొడుకు తను ప్రేమించిన యువతి కోసం కోట్లను ఖాతరు చేయకుండా పశువుల పాకలో ప్రేమించిన యువతి కోసం కష్టపడి.. ఏకంగా రైతుగా మారి పంటను పండించి ప్రేమ పంటను పొందుతాడు. ఇది నువ్వొస్తానంటే నేనొద్దాంటానా.. చిత్రం కథ. ఈ చిత్రాన్ని నిర్మించింది ఎం.ఎస్‌.రాజు. ఇదే కథను కొద్దిగా మార్చి తన కుమారుడు అశ్విన్‌ను హీరోగా చేసి తీశాడు ఎం.ఎస్‌.రాజు. ఆ కథలో విలన్‌ ప్రకాష్‌రాజ్‌ భార్య అయితే 'తూనీగ తూనీగ'లో విలన్‌ వినోద్‌కుమార్‌ కుమార్తె. లేడీ విలన్‌గా ఆమె చేసిన సన్నివేశాలు సీరియల్‌ కథలా అనిపిస్తాయి.

హీరోలు తమ వారసులుగా తమ కుమారుల్ని సినిమాల్లోకి ప్రవేశపెడుతుంటారు. ఎం.ఎస్‌.రాజు నిర్మాత కాబట్టి తన వారసుడ్ని నిర్మాతగా కాకుండా హీరోగా చేయాలని ప్రయత్నించాడు. అతని తండ్రి కూడా ఒకప్పటి నిర్మాత. బాగా లావుగా ఉన్న సుమంత్‌అశ్విన్‌ను ఒళ్లు బాగా తగ్గించేసి హీరోగా మార్చేశాడు. డాన్స్‌ పరంగా, యాక్షన్‌ పరంగా అశ్విన్‌ చేసే విన్యాసాలన్నీ అచ్చుగుద్దినట్లు రామ్‌ను పోల్చుకొనేలా ఉండటం అతనికి ఒక రకంగా కష్టమే. హీరోగా ఎదగాలనుకున్న తను కష్టపడి డాన్స్‌, ఫైట్స్‌, నటన నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకున్న అశ్విన్‌కు ఈ చిత్రకథలోని ప్రధాన పాయింట్‌ గొప్ప డాన్సర్‌ కావడం. 

డాన్స్‌ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి. అందులోనూ లారెన్స్‌, ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చిన 'స్టైల్‌' చిత్రం తర్వాత అంతకంటే హైరేంజ్‌లో డాన్స్‌ వేస్తేనే ప్రేక్షకుడ్ని మెప్పించగలరు. ఈ విషయాన్ని మర్చిపోయి సినిమా తీశాడనుకుంటే మనం పొరపడినట్లే. ఏదో కథతో తన కుమారుడ్ని హీరోగా ప్రమోట్‌ చేయాలనుకోవడం ఆయన చేసిన సాహసం. పైగా పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్నది- పెద్దల మాట. అది మరిచి తనే దర్శకుడిగా మారి కొడుకుచేత హీరోగా చేయించడం నిజమైన సాహసం. కొడుకు తనకు అందంగా కన్పించవచ్చు. హావభావాలు కూడా పలికించాలి. అదే బయటి దర్శకుడయితే కొంతలోకొంత జాగ్రత్తగా డీల్‌ చేసేవాడు.

కొత్తమ్మాయి రియా హీరోకంటే డీగ్లామర్‌గా ఉండాలి కాబట్టి ఆమెను ఎంచుకున్నట్లు ప్రతి సన్నివేశంలో తెలిసిపోతుంది. ఆమెకు వాడిన డ్రెస్‌కోడ్‌ కొన్నిచోట్ల ఇబ్బంది కల్గిస్తుంది. నటన కూడా తక్కువే. నాగబాబుకు ధీటుగా ఉండాలనే ప్రభులాంటి పాత్రను పెట్టారు. ప్రభు తన పాత్రకు న్యాయం చేశాడు. ఫ్యామిలీ డాక్టర్‌గా షిండే, పూజారిగా చంద్రమోహన్‌, కుటుంబ సభ్యుడిగా వినోద్‌ కుమార్‌లు కథలోని పాత్రలే. 

ఈ చిత్రంలో ప్రత్యేకత పాటలు ఎక్కువగా ఉండటమే. 'తూనీగ తూనీగ..' అనే టైటిల్‌ సాంగ్‌ నుంచి విరహవేదన పొందే పాట వరకు ఏవీ అంతగా ఆకట్టుకోలేదు. చిత్రానికి చెప్పుకోదగింది కెమెరామెన్‌ పనితనం. మిగిలిన డిపార్ట్‌మెంట్లు తమ పని తాముచేశాయి. ప్రేమకథా చిత్రాలకు ప్రధానమైన బలం ఫీల్‌ కల్గించడం. అది చిత్రంలో ఎక్కడా కన్పించదు. చిత్రంలో ప్రధాన లోపం అదే. యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌ను ఆకట్టుకునే చిత్రమవుతుందని చిత్ర సమర్పకుడు దిల్‌రాజు కాన్ఫిడెన్స్‌గా చెప్పడం... బహుశా.. బొమ్మరిల్లు కాన్సెప్ట్‌ను కొంత, నువ్వొస్తానంటే నేసొస్తానా! కాన్సెప్ట్‌ మరికొంత, డార్లింగ్‌ కాన్సెప్ట్‌ ఇంకొంత కలగలిపి సినిమా తీశాం కాబట్టి అలా అని ఉంటారేమో అనిపిస్తుంది. మరి ఈ తూనీగను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger