.
Home » » సునీల్ "పూల రంగడు" బాగానే నవ్వించాడండోయ్...

సునీల్ "పూల రంగడు" బాగానే నవ్వించాడండోయ్...

Written By Hot nd spicy on Sunday, 19 February 2012 | 06:31

నటీనటులు: సునీల్‌, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు, ఆలీ, ప్రదీప్‌ రావత్‌, రఘుబాబు, దేవ్‌గిల్‌, పృధ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యంరాజేష్‌, దువ్వాసి మోహన్‌, ఖలీల్‌, ప్రవీణ్‌, వేణుగోపాల్‌ తదితరులు. 
సాంకేతిక సిబ్బంది... మాటలు: శ్రీధర్‌ సీపన, ఎడిటింగ్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫి: ప్రసాద్‌మూరెళ్ళ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వీరభద్రం.

విడుదల: 18.2.2012.. శనివారం.

సునీల్‌ సినిమాలంటేనే కామెడీగా ఉంటాయి. కమేడియన్‌గా తనకంటూ గుర్తింపు పొందిన సునీల్‌... ఆ తర్వాత హీరోగా తనేంటో నిరూపించుకోవడానికి తాపత్రయపడుతున్నాడు. మర్యాదరామన్నతో రాజమౌళి అతనికి ఓ క్రేజ్‌ను సంపాదించిపెట్టాడు. తాజాగా అలాంటి ప్రయత్నం చేశాడు. తనకంటూ ప్రత్యేకత నిరూపించుకోవడానికి చాలా కష్టపడి బాడీని సిక్స్‌ప్యాక్‌తో ఒక కొలిక్కి తెచ్చాడు. సిక్స్‌ప్యాక్‌ వల్ల ఫేస్‌లో గ్లామర్‌ తగ్గినా... దానికి తగినట్లు సినిమాలో చూపించాడు. ఈ చిత్ర కథను మర్యాదరామన్న ఫార్మెట్‌లో దర్శకుడు వీరభద్రమ్‌ తీర్చిదిద్దాడు.

కథలోకి వెళితే... రంగ(సునీల్‌)ది హైదరాబాద్‌. పనీపాటా లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. కానీ చెల్లెలు పెండ్లి చేయాలనే గోల్‌ ఉంటుంది. తండ్రి కోట శ్రీనివాసరావు పెయింటర్‌. కొడుకు చేసిన అప్పులు ఆయనకు తిప్పలు తెచ్చిపెడతాయి. కాగా, దుబాయ్‌కు చెందిన ఓ ఆసామి వరంగల్‌లో ఉన్న తన 30 ఎకరాలను అమ్మడానికి సిద్ధమవుతాడు. కానీ ఆ స్థలానికి కుడివైపు స్థలం కొండారెడ్డి(దేవ్‌గిల్‌)ది. ఎడమవైపుది లాలాగౌడ్‌(ప్రదీప్‌ రావత్‌)ది. వీరిద్దరు పక్క పక్క పూరివాళ్ళు. ఇద్దరూ బావాబావమరుదులు.

కానీ ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై వాలదు. ఇద్దరూ క్రూరులు. ఆ 30 ఎకరాల స్థలాన్ని ఎవరినీ కొననీయరు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న రంగకు ఆ స్థలం ఆఫర్‌ వస్తుంది. డబ్బు లేకపోయినా... అతని అప్పులిచ్చే సేఠ్‌ అప్పు మరీ ఇచ్చి కొనిపిస్తాడు. అందుకు రంగ ఇల్లు తాకట్టు పెట్టిస్తాడు. ఆ స్థలం చాలా చవక్కా వస్తుందని దాన్ని అమ్మితే కోట్లు వస్తాయని కలలు కంటూ రంగ వరంగల్‌ వస్తాడు. కానీ అక్కడ పరిస్థితి చూసి షాకవుతాడు.

ఆ ఊరిలో ఉన్న రంగ ఫ్రెండ్‌ అలీ ద్వారా కొండారెడ్డి ఇంటిలో పనివాడిగా చేరతాడు. క్రమేణా అతనికి నమ్మినబంటుగా మారతాడు. స్థలం దక్కాలంటే.. లాలాగౌడ్‌ కుమార్తెను అనిత (ఇషాచావ్లా)ను ఒప్పించాలని ట్రై చేస్తాడు. ఆ ప్రయత్నం ప్రేమకు దారితీస్తుంది. కొండారెడ్డి తన మేనకోడలు అనితను పెండ్లి చేసుకోవాలనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.

కథాపరంగా మర్యాద రామన్నను మరోరకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తొలి చిత్రం అహ నాపెళ్ళంట అల్లరి నరేష్‌తో తీశాడు. మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు స్క్రీన్‌ప్లేను ఆకట్టుకునేలా చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. సునీల్‌పై కథంతా నడుస్తుంది. తను హీరోగా నిలదొక్కుకోవడానికి నానా కష్టాలు పడాల్సివచ్చింది.

డాన్స్‌, ఫైట్లు బాగా చేశాడు. సిక్స్‌ ప్యాక్‌ ఎలా చూపిస్తాడా! అనే ఆసక్తి.. కథకు సరిపడే విధంగా యాక్షన్‌ సీన్‌లో చూపించాడు. ఎమోషనల్‌ ఫైట్‌కు అది సరిపోయింది. ఇషాచావ్లాకు హావభావాలు పెద్దగా పలకపోయినా... కథకు ఉపయోగపడే పాత్ర. అలీ, రఘుబాబు, రమేష్‌ పాత్రలు కథలో భాగంగా సరిపోయాయి.

క్రూరమైన వ్యక్తులుగా ప్రదీప్‌ రావత్‌, దేవ్‌గిల్‌ పాత్రలు సరిపోయాయి. అనూప్‌ సంగీతం సరిపోయింది. టైటిల్‌సాంగ్‌తో పాటు రెండు పాటలు బాగున్నాయి. కెమెరా పనితనం ఫర్వాలేదు. ప్రధానంగా శ్రీధర్‌ సంభాషణలు క్యాచీగా ఉన్నాయి. 'ఇదిగో టీ.. అంటే.. 'అదిగో అటీయ్‌'..అంటూ అవతలవారికి ఇవ్వమన్నట్లు... ఈజీగా రాశారు. పాటలు బాగున్నాయి. వినోదంతో పాటు కథనాన్ని నడిపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. సునీల్‌ నృత్యాలు ఆకట్టుకున్నాయి. విలనిజంలోనూ వినోదాన్ని పండించారు. ఇలా ప్రతి సన్నివేశంలో హాస్యానికి పెద్దపీట వేశాడు. అందరినీ నవ్వించే ప్రయత్నంలో సునీల్‌ సక్సెస్‌ అయ్యాడు. 'కిక్‌' సినిమా తీసిన వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మించి మరో సక్సెస్‌ సాధించారని చెప్పొచ్చు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger