దక్షిణ భారత, హిందీ సినీ పరిశ్రమకు చెందిన సినీ తారలతో నిర్వహించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సక్సెస్ అయిన నేపథ్యంలో రెండవ సీజన్ సీసీఎల్ సిరీస్ జనవరి 13న షార్జాలో ప్రారంభంకానుంది. లీగ్ ప్రమోషన్లో భాగంగా కర్టెన్ రైజర్ మ్యాచ్ ఈ నెల 19న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెక్షన్ సెంటర్‌లో జరుగనుంది. ఆరు చిత్ర పరిశ్రమలకు చెందిన 100 మంది హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు. భారత దేశ సినీ చరిత్రలోనే ఇంత మంది హీరోలు ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి కాబోతోంది.
సీసీఎల్ మొదటి సీజన్‌లో నాలుగు చిత్ర రంగాలకు చెందిన జట్లు టైటిల్ కోసం తలపడితే, ఈ రెండవ సీజన్‌లో బెంగాలీ, మలయాళీ చిత్ర రంగాల నుంచి అదనంగా మరో రెండు జట్లు పాల్గొనబోతున్నాయి. బెంగాల్ టైగర్స్ జట్టును బోనీకపూర్, శ్రీదేవిలు సొంతం చేసుకోగా, కేరళ స్ట్రయికర్స్ జట్టును మోహన్‌లాల్, లిజీ ప్రియదర్శన్‌లు సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. తొలి మ్యాచ్ ముంబయ్ హీరోస్, గత ఛాంపియన్ చెన్నయ్ రైనోస్ జట్ల మధ్య జనవరి 13న షార్జాలో జరుగనుంది. ప్రాంతీయ భాషా చిత్రాల తారలను దేశవ్యాప్త ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు, జాతీయ స్థాయి తారలను ప్రాంతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు అనువైన వేదికగా సీసీఎల్ పేరు సంపాదించుకుంది.

Post a Comment